కార్తీక పురాణం - 1వ అధ్యాయము
కార్తీక మాహాత్యమును గురించి సూత పౌరాణికుడు నైమిశారణ్య ఋషులకు వివరించుట
*C:\Users\maake\Downloads\karthikamasam */>
నైమిశారణ్యములో శౌనకాది మహా మునులు గురుతుల్యుడగు సూతమహామునితో మహాత్మా! తనవలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహస్యములు సంగ్రహముగ గ్రహించినవారము, కార్తీకమాస మాహాత్మ్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కావున తమరు కార్తీక మాసం వ్రతమును వివరించవలసినది" అని కోరిరి.
అంతన సూతమహర్షి "ఓ మునిపుంగవులారా! ఒకనాడు నారద మహాముని సృష్టికర్తయగు బ్రహ్మను కార్తీక మాసం వ్రతం విశిష్టత ఏమిటి అని అడుగగా బ్రహ్మదేవుడు - నారధా వినుము! విష్ణుమూర్తి-లక్ష్మీదేవికి తెలియజేసిన విధమును, సాంబశివుడు-పార్వతిదేవికి తెలియచేసిన విధానమును పురాణ గాధను నేను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక, యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడు" అని యిట్లు చెప్పెను.
పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి "ప్రాణేశ్వరా! సకల ఐశ్వరములు కలుగజేయునట్టిదీ, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినదీ, శాస్త్రసమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంతవరకు నాచరింపబడేదిదీ అను వ్రతమును వివరించుము" అని కోరెను. అంతట మహేశుడు మందహాసము మొనరించి "దేవీ! నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడియున్నది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడుము" అని మిథిలానగరము వైపునకు దిశగా చూపించెను.
మిథిలా నగరములో వశిష్ట మహాముని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్లు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని "మునివర్యా! తమ రాకవల్ల నేనూ, నాశరీరమూ, నాదేశమూ, నా ప్రజలూ పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా మిథిలానగరము పవిత్రమైనది. తమరు ఇచటికి ఏల వచ్చితిరో సెలవొసంగండి" అని వేడుకొనెను.
అందుకు వశిష్ఠుడు "జనక మహారాజా! నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టితిని, దానికి కావలసిన ఆర్థికబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించ నిశ్చయించి యిటు వచ్చితిని" అని పలుకగా జనకుడు "మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరింపుడు. కాని చిరకాలమునుండి నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకోదలచితిని, నా అదృష్టముకొలదీ యీ అవకాశము దొరికినది. గురురత్నా! సంవత్సరములో గల మాసములలో కార్తీకమాసమే యేల పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనం ఏమిటి?" అను సంశయము నాకు చాలకాలమునుండియున్నది. కావున తామే కార్తీక మాస మాహాత్మ్యమును వివరించవలసినది" అని ప్రార్థించెను.
వశిష్ఠ మహాముని చిరునవ్వుతో "రాజా! తప్పక నీ సంశయము తీర్చగలను. నేను చెప్పబోవు వ్రతకథ సకల మానవులు ఆచరించదగినదీ, సకల పాపహరమైనదీ అయి యున్నది. ఈ కార్తీకమాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకే ఆనందదాయకమైనది. అంతేకాక వినినంతమాత్రముననే ఎంతటి నరకబాధలైనను తొలగి యిహమందును, పరమందును, సౌఖ్యమును పొందగలరు. నీలాంటి సజ్జనులు యీ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుము"మని యిట్లు చెప్పసాగెను.
వశిష్ఠుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట
ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైననూ, యే వయసువాడైననూ 'ఉచ్చ-నీచ' అనే భేదములేక కార్తీక మాసములో, సూర్యభగవానుడు తులా రాశియందుండగా, వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని, స్నానమాచరించి, దానధర్మములను, దేవతాపూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీకమాస ప్రారంభమునుండే యిట్లు చేయుచు, విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీకమాసమునకు ఆధిదేవతయగు దామోదరునికి నమస్కరించి "ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి అడ్డంకములు రానీయక నన్ను కాపాడుము" అని ధ్యానించి వ్రతమును ప్రారంభించ వలయును.
*C:\Users\maake\Downloads\karthikamasam */>
కార్తీక మాస స్నాన విధానం
ఓ రాజా! ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకొని, నదికి బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునికి, పరమేశ్వరునికి, భైరవునికి నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరల నీటమునిగి సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానము చేసి, పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు సమర్పించి, గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొదలైన నదులలో ఏ ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి, మడిబట్టలు కట్టుకొని శ్రీమహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప, దీప, నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని, గంధము తీసి స్వామికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిధి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి, తన యింటి వద్ద గాని, దేవాలయములో గాని, లేక రావిచెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదువవలయును.
ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయం గాని, విష్ణు ఆలయం గాని, లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారు చేయించి, స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసినవారిని జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడ తత్సమాన ఫలము దక్కును.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి మొదటి అధ్యాయము — మొదటి రోజు పారాయణము సమాప్తము.
శ్లో॥ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతీ త్రయశ్శిఖాః
తస్మై తారాత్మనే మేథా దక్షిణామూర్తయే నమః॥