కార్తీక పురాణం - 2వ అధ్యాయము
ఋషుల సంశయ నిరసనార్థమాக కార్తీక వ్రత ఫలమును తెలుపుట
జనక మహరాజ! ఇంతవరకు నీకు కార్తీకమాసమునందు ఆచరించవలసిన విధి విధాన క్రమము మాత్రమే తెలియచేసితిని, కార్తీకమాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కావున, సోమవార వ్రతవిధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము.
కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైనరోజు, ఆరోజున స్త్రీగాని, పురుషుడుగాని, ఏజాతివారైనాగాని రోజంతా ఉపవాసముండి, నదీస్నానము చేసి తమశక్తి కొలదీ దానధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును. ఈవిధముగా నిష్ఠతోనుండి ఆరాత్రి యంతయు జాగరణచేసి పురాణపఠనము చేసి, తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి, తిలాదానము చేసి, తమ శక్తికొలదీ పేదలకు అన్నదానము చేయవలయును. అటుల చేయలేనివారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైననూ తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించ వలయును. ఉండగలిగిన వారు సోమవారమునాడు రెండు పూటలా భోజనముగాని యేవిధమైన ఫలహారముగాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీకమాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసినయెడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి, శివసన్నిధికి చేర్చుకోనును.
భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి, శివపూజ చేసినచో కైలాసప్రాప్తియు విష్ణుపూజ చేసినచో వైకుంఠప్రాప్తియు నొందును.
దీనికి ఉదాహరణ ముగ నొక యితిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను. శ్రద్ధగా వినుము.
కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట
పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పౌరోహిత్యం చేసి తన కుటుంబమును పోషించుకుంటూ వుండెను. అతనికి చాలకాలము నకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు 'స్వాతంత్య్ర నిష్ఠురి', తండి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ యను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములూ, శాస్త్రములూ అభ్యసించినవాడై నందున సదాచార పరాయణుడై యుండెడి వడు. అతడు భూతదయ గల్గినవాడు. నిత్యసత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడునూ యగుటచే లోకులెల్లరు నతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమపురుషుని భార్య యగు నిష్టురి యవ్వనగర్వముతో, కన్ను మిన్నుగానక పెద్దలను దూషించుచు- అత్త మామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సాంగత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్త మామలు ఆమెను తమ యింటినుండి వెడలగొట్టిరి. కాని, శాంతస్వభావము గల ఆమె భర్త ఆమే యందు అభిమానము పోక, ఆమె యెంతటి నీచకార్యములు చేసిననూ సహించి, 'ఛీ పా'మ్మనక, విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కాని, చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళితనమున కేవగించుకొని- ఆమెకు "కర్కశ" అనే ఎగతాళి పేరును పెటిరి -అది మొదలందరూ దానిని "కర్కశా" అనియే పిలుస్తూ వుండేవారు.
ఇట్లు కొంతకాలము జరిగిన పిమట ఆ కర్కశ, ఒకనాటి రాత్రి యేకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయమును చూచి, మెల్లగాలేచి, తాళి కట్టిన భర్తయన్న విచక్షణగాని, దయాదాక్షిణాల్యుగాని లేక, ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృతదేహమును యెవరి సహాయము అక్కరలేకనే, అతిరహస్యంగా దొడ్డిదారిని తీసుకుని వెళ్లి వూరి చివరనున్న పాడునూతిలో బడవైచి పైన చెత్తాచెదారములతో నింపి, యేమియు యెరుగని దానివలె యింటికి వచ్చెను. ఇక తనకు యే యాటంకములు లేవని యింకా విచ్చలవిడిగా సంచరించుచు, తన సౌందర్యం చూసి యెందరినో క్రీగంటనే వశపరుచుకొని, వాల్ల చెల్లివ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచూ వర్ణసంకరురా లయ్యెను. అంతియేగాక పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను, తన మాటలతో చేరదీసి, వారిక్కూడా దుర్భుద్ధులు నేర్పి పాడుచేసి, విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను.
జనకరాజా! యవ్వనబింకము యెంతో కాలముండదు గదా! కాలమొక్కరీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణ ములు (చక్కెర వ్యాధి వల్ల ఏర్పడే పుండ్లు) బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము రసికారుట ప్రారంభమయ్యెను. దానికితోడు శరీరమంతా కుష్టువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలు చున్నది. దినదినమూ శరీరపటుత్వము కృశించి కురూపియై భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములోనుండగా యెన్నోవిధాల తృప్తి కలిగించిన విటులు యే ఒక్కరూ యిపుడామెను తొంగిచూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన యెడల తమనెటులైననూ పలుకరించునని, ఆ వీధిమొగమైననూ చూడకుండిరి. కర్కశ యిటుల నరక బాధలనుభవించుచూ, పురుగులుపడి కొంతకాలమునకు చనిపోయినది.
బ్రతికి నన్నాళ్ళూ ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనమా చేయని పాపిష్టురాలుగదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకొని పోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మరాజు, చిత్రగుప్తులవారిచే ఆమె పాపపుణ్య ముల జాబితాను చూపించి "భటులారా! ఈమె పాపచరిత అంతింతకాదు. వెంటనే యీమెను తీసుకువెళ్ళి యెఱ్ఱగా గా కాల్చిన యినుప స్తంభమునకు కట్టబెట్టుడు" అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకుగాను యమభటు లామెను యెఱ్ఱగా కాల్చిన యినుపస్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను యినుపగదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకూ, అత్తమామలకూ యపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి, యినుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి.. తుదకు కుంభీపాకమను నరకములో వేయగా, అందు యినుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెఱ్ఱులు కుట్టినవి. ఆమె చేసిన పాపము లకు యిటు యేడు తరాలవాళ్ళు, అటు యేడు తరాలవాళ్ళు నరక బాధలు పడుచుండిరి.
ఈ ప్రకారముగా నరకబాధల ననుభవించి, కడకు కళింగదేశమున కుక్క జన్మ మెత్తి, ఆకలి బాధపడలేక యిల్లిల్లూ తిరుగుచుండగా, కఱ్ఱలతో కొట్టువారు కొట్టుచూ, తిట్టువారు తిట్టుచూ, తరుమువారు తరుముచూ వుండిరి. ఇట్లుండగా ఒకానొకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాస ముండి, సాయంత్రము ము నక్షత్రదర్శనము చేసి, బలియన్నము నరుగుపై పెట్టి, కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున యీకుక్క వచ్చి ఆ బలియన్న మును తినెను. వ్రతనిష్ఠాగరిష్టుడైన ఆ విప్రుని పూజావిధానముచే జరిపించిన బలియన్న మగుట చేతనూ, ఆరోజు కార్తీకమాస సోమవారమగుటవలనను, కుక్క ఆరోజంతయు ఉపవాస ముతో వుండుటవలననూ, శివపూజా పవిత్రస్థానమైన ఆ యింటదొరికిన ప్రసాదము తినుటవలననూ, ఆ శునకమునకు జన్మాంతరజ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆ శునకము 'విప్రకులోత్తమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకువచ్చి చూడగా కుక్కతప్ప అన్యులెవరు లేనందున లోని కేగెను. మరల 'రక్షింపుము రక్షింపుము' యని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకువచ్చి 'ఎవరు నీవు! నీ వృత్తాంతమేమి?' యని ప్రశ్నించగా, యంత నా కుక్క "మహానుభావా! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులాంగనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను జంపి, వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత, యమదూతలవల్ల మహానరక మనభవించి నా పూర్వీకుల పుణ్యఫలమువల్ల యీ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతముచేసి యిచ్చట వుంచిన బలియన్నమును తినుటవలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకా రంగా, మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి యిచ్చి నాకు మోక్షము కలిగించ మని ప్రార్థించుచున్నాను" యని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మాహాత్మ్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారంనాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పకవిమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనముజేసి అక్కడివారందరూ చూచుచుండగనే యా విమానమెక్కి శివసాన్నిధ్యమున కేగెను.
వింటివా జనక మహారాజా! కావున, నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి, శివసాన్నిథ్యమును పొందుమని వశిష్ఠులవారు హితబోధచేసి, యింకనూ యిట్లు చెప్పసాగిరి.
ఇట్లు స్కాందపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి రెండవ అధ్యాయము — రెండవరోజు పారాయణము సమాప్తము.