కార్తీక పురాణం - 30వ అధ్యాయము
కార్తీక మాస సంపూర్ణ ఫలం
కార్తీకవ్రత మహిమా ఫలశ్రుతి
నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతుని గాంచి "ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా! ధర్మములన్నింటిలో మోక్షసాధన కు ఉపకరించు వుత్తమ ధర్మఏది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొంద గల వుపాయమేమి? హరి నామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయము లతో నున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.
అంతట సూతుడా ప్రశ్నలను ఆలకించి “ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖము లతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాదిక్రతువు లొనర్చిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు. సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను.
కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను. శ్రద్ధగా ఆల కింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుడు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీస్సానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయును. ఈనెలరోజులు విధవ వండిన పదార్దములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయ వలెను. ప్రతిదినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈవిధముగా చేసిక సకల పాపములనుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీవిధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు.
ఇట్లు ఆచరించుటకు శక్తి వుండి కూడా ఆచరించక గాని ,ఆచరించువారాల జూచి యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములోపడి యమకింకరుల చేత నానా హింసలపాలు కాగలరు. అంతియేగాక అట్టివారు నూరుజన్మల వరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.
కార్తీకమాసములో కావేరి నదిలోగాని, గంగానదిలోగాని, అఖండ గౌతమీవదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినవారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసు లగుదురు.
సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమై నది. అధికఫలదాయకమైనది. హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మ లేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెడీ, కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీకమాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు అసహ్యము కలుగును.
కావున, ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్య కాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమినాడు అయినను తమశక్తికొలదీ వ్రతమాచరించి పురాణశ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈమాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు, చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెలరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను, మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ, దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి త్రింశాధ్యాయము - ముప్పదన ఆఖరిరోజు పారాయణము సమాప్తము.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణంభవతు ఓం శాంతి శ్శాంతిః॥