ௐ

కార్తీక పురాణం - 29వ అధ్యాయము

కార్తీక పూర్ణిమ సంబంధమైన దర్శన విధానం

అంబరీషుడు దూర్వాసుని పూజించుట-ద్వాదశీ పారాయణము

అత్రి మహాముని అగస్త్యులవారితో యీవిధముగా - సుదర్శనచక్రము అంబరీషు నకభయమిచ్చి వుభయులను రక్షించి, భక్తికోటికి దర్శనమిచ్చి అంతర్థానమైన వైనము చెప్పి- తిరిగి యిట్లు నుడువ నారంభించెను.

athidhipooja

(అంబరీషుడు దూర్వాసుని పూజించి అతిధి సత్కార్యములు చేయుట )

ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై బడి దండప్రణామము లాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, “ఓ మునిశ్రేష్ఠా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్యగృహస్థుడను, నాశక్తి కొలది నేమ శ్రీమన్నారాయణుని సేవింతును. ద్వాదశీ వ్రతము జేసుకొనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నావలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీయెడల నాకు అమితమైన అమరాగముండుట చేతనే తమకు అతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్జుని చేయుడు. మీరు దయార్ద్రహృదయులు, ప్రధమకోపముతో నన్ను శపించినను మరల నాగృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నానోట పలుకులు రాకున్నవి. నాకండ్ల వెంటవచ్చు ఆనందబాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవ చేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నరజన్మ రాకుండా వుండేటట్లును, సదా మీబోటి మునిశ్రేష్ఠుల యందును- ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్థించి, సహపంక్తి భోజనమువకు దయచేయు మని ఆహ్వానించెను.

ఈవిధముగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, యెవరు శత్రువులకైనను శక్తికొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుఃక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన యీ స్వల) కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశీ వ్రతనిష్టుడవగు నీకు మనస్తాపమును కలుగజేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయితివి. నీలో భోజనము చేయుట నాభాగ్యము గాక మరొకటి యగునా?" అని దూర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవుపొంది తన ఆశ్రమమునకు వెళ్లేము.

ఈ వృత్తాంతమంతయు కార్తీకశుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మాహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రపన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆ రోజునకంతటి శ్రేష్ఠతయు, మహిమయు గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరినామ సంకీర్తనచే గడపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణచేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తికొలదీ శ్రీమన్నారాయణుని ప్రీతికొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టివాని సర్వపాపములు యీవ్రత ప్రభావము వలన పటాపంచలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నారాయణు నకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశీ ఘడియలు తక్కువగా యున్నను, ఆ ఘడియలు దాటకుండగనే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిరనివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో అట్టివారు ఏకాదశీ వ్రతము, ద్వాదశీ వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీకశుద్ధ ద్వాదశి అన్నివిధముల శ్రేయస్కర మైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మజ్జిచెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీకమాసములో నియమానుసారముగ జేసిన యేకొంచెము పుణ్యమైనను, అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులూ తరించిరి.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి ఏకోనత్రింశాధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.