ௐ

కార్తీక పురాణం - 5వ అధ్యాయము

చతుర్మాస్య వ్రత విధానమైన సూర్యోపవాస వ్రతము

vanabhojanam

కార్తీకమాస వనభోజన మహోత్సవము

ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజానంతరమున శివాలయ మునందుగాని, విష్ణ్వాలయమునందుగాని శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసినవారి సర్వపాపములును నివృత్తియగును. ఈ కార్తీకమాసము లో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు చేరుకునేదురు. భగవద్గీత కొంతవరకు పఠించినవారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి ములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం చేరేదరు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టుక్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరిచెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా వుసిరి చెట్టుక్రిందనే భోజనంపెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును. వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును. ఈవిధంగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మముపోయి నిజరూపము కలిగెను యని వశిష్ఠుల వారు చెప్పిరి. అదివిని జనకరాజు "మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మ మేల కలిగెను? దానికి గల కారణమేమి?" యని ప్రశ్నించగా, వశిష్ఠులవారు యివిధంబుగా చెప్పనారంభించిరి.

కిరాత మూషికములు మోక్షము నొందుట

రాజా! కావేరీతీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వానిపేరు శివశర్మ. శివశర్మ చిన్నతనమునుండి భయ భక్తులు లేక అతిగారాబముగా పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడాతని తండ్రి కుమారుని పిలిచి "బిడ్డా! నీ దురాచారముల కంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీకమాసమున నదిలో స్నానంచేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినయెడల, నీవు చేసిన పాపములు తొలగుటయేకాక నీకు మోక్షప్రాప్తి కూడ కలుగును. కాన, నీవు అటులచేయు"మని హితము బోధించెను. అంతట కుమారుడు 'తండ్రీ! స్నానము చేయుటం అనేది వంటిమురికి పోవుటకు మాత్రమే కాని వేరుకాదు! స్నానంచేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిదికాదా?' అని వ్యతిరేకార్థ ములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానము విని, తండ్రి "ఓరీ నీచుడా! కార్తీకమాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొఱ్ఱలో ఎలుకరూపములో బ్రతికెదవుగాక" అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి "తండ్రీ! క్షమింపుము. అజ్ఞానాంధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకనచేసి వాటి ప్రాభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాపవిమోచన ఎపుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపు"మని ప్రాధేయపడెను. అంతట తండ్రి "బిడ్డా! నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీకమాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొందు దువు' అని కుమారుని వూరడించెను. వెంటనే శివ శర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొఱ్ఱలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను.

ఆ అడవి కావేరీ నదీతీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్ధమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభి రామాయణము చర్చించుకొనుచూ నదికి వెళ్ళుచుండెడివారు. ఇట్లు కొంతకాల మైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేత ముగా కావేరీనదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికము వున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీకపురాణ మును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టుతొఱ్ఱలో నివసించుచున్న మూషికము వీరిదగ్గరున్న పూజాద్రవ్యములలో నేదైనా తినేవస్తువు దొరుకుతుందేమోనని బైటకువచ్చి చెట్టుమొదట నక్కియుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరిజాడ తెలిసికొని, 'వీరు బాటసారులై వుందురు. వీరివద్దనున్న ధన మపహరించవచ్చు' అనెడు దుర్బుద్ధితో వారికడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులు అని వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి "మహానుభావులారా! తమరు యెవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్యదర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కల్గుచున్నది.. ఎందుకు వచ్చితిరి, వివరింపుడు" అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు "ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీస్నానార్థమై యీ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును యిచట కూర్చుండి సావధానుడవై ఆల కింపుము" అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీకమహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించు చుండగా తనవెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారము కొరకై చెట్టుమొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన మూషికము నకు కూడ తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది "మునివర్యా! ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా యీ మూషిక రూపమునుండి విముక్తుడనైతి"నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను.

viswa

కనుక ఓ జనకామహరాజ! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీకపురాణమును చదివి, యితరులకు వినిపించవలెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి ఐదవ అధ్యాయము - ఐదవరోజు పారాయణము సమాప్తము.