ௐ

కార్తీక పురాణం - 6వ అధ్యాయము

దీపదానం విధి మహత్యం

ఓం రాజ శ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసం నెలరోజులూ పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచిగంధపు నీటితో భక్తిగా పూజించునో, అట్టివానికి అశ్వమేథయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులనో ప్రత్తిని తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితోగాని, గోధుమ పిండితోగాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తికొలది దక్షిణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాసమందు ప్రతిదినము చేసి ఆఖరిరోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమపిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెలరోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిదికూడా దానమిచ్చిన యెడల సకలై శ్వర్యములు కలుగుటయేగాక మోక్షప్రాప్తి కhలుగును. దీపదానం చేయువారు యిట్లు వచింపవలెను.

శ్లో॥ సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ॥

అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా, “అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు, సకల సంపదల నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!" యని అర్థము. ఈవిధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధాన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బాహ్మణులకైననూ భోజనం పెట్టి దక్షిణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరిసంపదలు, విద్యాభివృద్ధి, ఆయు వ్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెదను ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

widowwomen

లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట

పూర్వకాలమున ద్రవిడదేశమునందొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలదికాలమునకే భర్త చనిపోయెను. ఆమెకు సంతానముగాని, ఆఖరికి బంధు వులుగానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసిపని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది యేమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆవిధముగా తనవద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.

ఈవిధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకీస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి! ఆమె ఒక్క దినమున కూడ ఉపవాసముగాని, దేవుని మనసారా ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లే వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్ష గానికిని పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుకొనుచుండెడిది.

అటుల కొంతకాలము జరిగెను. ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో బస చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డులను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడ తెలుసుకొని ఆమెకడకు వెళ్లి “అమ్మా! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసికొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసనకొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దానిని తినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములోబడి నశించుచున్నాడు. కాన, నామాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహారార్థముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాతఃకాలమున నదీస్నానమాచ రించి, దానధర్మముల చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"వని వుపదేశమిచ్చెను.

dheepadhaanam

ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటకు జన్మరాహిత్యమై మోక్షము నొందెను .కావున కార్తీకమాస వ్రతములో అంత మాహాత్మ్యమున్నది

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవరోజు పారాయణము సమాప్తము.