కార్తీక పురాణం - 7వ అధ్యాయము
కార్తీక స్నానారాధన ఫలము
వశిష్ఠులవారు జనకమహరాజు నకు ఇంకనూ యిటుల బోధించిరి. "ఓ రాజా! కార్తీకమాసము-దాని మాహాత్మ్యము గురించి యెంత వినిననూ తనివితీరదు. ఈ మాసములో మహవిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి యింట లక్ష్మీదేవి స్థిరముగా నుండును.- తులసీదళములతోగాని, బిల్వపత్రములతోగాని సహస్రనామపూజ చేసిన జన్మ రాహిత్యము కలుగును. కార్తీకమాసమందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామును వుంచి భక్తితో పూజించిన యెడల వారికి కలుగు మోక్షము మింతింతగాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన, సర్వపాపములు పోవును ఈవిధముగా కార్తీకస్నానములు దీపారాధనలు చేయలేనివారు ఉదయం సాయంకాలం యే గుడికైననూ వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వేలి దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్వాలయమునగాని జండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలై పోవును. ఈ కార్తీకమాసములో తులసికోటవద్ద ఆవుపేడతో అలికి వరిపిండి శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు, ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈవిధముగా జేసి నైవేద్యంమిడి కార్తీకపురాణము చదువుచుండిన యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీకమాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించి నా ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక యింటింట తిరిగి కఱ్ఱలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీకమాసము నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిననూ మాసఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమును ఆచరించి తరింపుము అని చెప్పెను.
"నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్ట వపుర్ధరాభ్యాం
నగేంద్రకన్యా వృష కేతనాభ్యాం నమోనమ శ్శంకర పార్వతీభ్యాం|"
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి సప్తమాధ్యాయము — సప్తమదిన పారాయణము సమాప్తము.