కార్తీక పురాణం - 8వ అధ్యాయము
కార్తీక చతుర్దశీ నియమ ప్రభావమైన చిత్రలేఖ రక్ష
శ్రీ హరి నామస్మరనే ధన్యోపాయము
వశిష్ఠుడు చెప్పినదంతా విని “మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు, పుణ్యము సులభంగా కలుగు ననియూ, అది- నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించు చుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురుగదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక, వర్ణసంకరులు రౌరవాది నరకహేతువులగు మహాపాప ములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించు చున్నాను" యని కోరెను.
అంతట వశిష్ఠులవారు చిరునవ్వి నవ్వి, "జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే, నేను వేదవేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్త్విక, రాజస, తామసములు అని మూడు రకముల ధర్మ గుణములు కలువు. సాత్త్వికమనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమున సత్యమను ధర్మగుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్చితము కావించి, మన వాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు యెంతయో ఆధిక్యత కలదు. సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రము కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగధగ మెరిసి ముత్యమగు విధముగా సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మ మాచరించుచూ గంగ, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందూ, దేవాలయములయందూ, వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసిననూ, లేక ఆ నదీతీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించినను విశేష ఫలమును పొందగలరు.
రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించునది అగును.
తామస ధర్మమనగా శాస్త్రోక్తవిధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు.
దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము, తెలిసిగాని, తెలియకగాని ఉచ్ఛరించిన వారి సకల పాపములు పోయి ముక్తినొందుదురు. దానికొక యితిహాసము కలదు.
అజామీళుని కథ
పూర్వకాలమందు కన్యాకుబ్జము అను నగరమున నాల్గువేదములు చదివిన ఒక బ్రాహ్మణుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతియను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆబాలుని అతిగారాబముగా పెంచుచు, అజామీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమా నుడగుచు అతిగారాబము వలన పెద్దలనుకూడ నిర్లక్ష్యముగా చూచుచు, దుష్టసావాస ములు చేయుచు, విద్య నభ్యసింపక, బ్రాహ్మణధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈవిధముగా నుండగా కొంతకాలమునకు అజామీళుడ కి యవ్వనమురాగా కామాంధుడై, మంచిచెడ్డలు మరచి,యజ్ఞోపవీతము త్రెంచి, మద్యం సేవించుచు, ఒక ఎరుకలజాతి స్త్రీని వలచి, నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లితండ్రులను మరిచి, ఆమె యింటనే భుజించుచుండెను. అతిగారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తమ బిడ్డలపై యెంత అనురాగమున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటినుంచీ అదుపు ఆజ్ఞలలో నుంచకపోయిన యెడల యీవిధంగానే జరుగును. కావున అజామీళుడు కులభ్రష్టుడు కాగా, వానిబంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాతవృత్తిలో జీవించుచుండెను. ఒకరోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు యేడ్చి, తరువాత ఆ అడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకలదానికి అంతకుముందే ఒక కుమార్తె వుండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్తవయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి "నారాయణ" అని పేరుపెట్టి పిలుచుచు ఒక్కక్షణమై ననూ విడువక, యెక్కడకు వెళ్ళినా నారాయణుడిని వెంటబెట్టుకొని వెళ్ళుచూ, "నారాయణా సాకుచుండిరి. కాని “నారాయణ" యని నామము స్మరించినయెడల తన పాపములు నశించి, మోక్షము పొందవచ్చును అని మాత్రము అతనికి తెలియ కుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీళునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచముపట్టి చావునకు సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకర ఆకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామీళుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక “నారాయణా" "నారాయణా" యనుచునే ప్రాణములు విడిచెను. అజామీళుని నోట “నారాయణా" యను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. ఆదేవేళకు దివ్యమంగళా కారులు, శంఖ, చక్ర, గదాధారులూయగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చి “ఓ యమభటులారా! వీడు మావాడు. మేము వీనిని వైకుంఠమునకు తీసికొనిపోవుటకు వచ్చితిమి" యని చెప్పి, అజామీళుని విమాన మెక్కించి తీసుకొనిపోవుచుండగా యమదూతలు "అయ్యా! మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొనిపోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి కావున, వానిని మాకు వదలు"డని కోరగా విష్ణుదూతలు యిట్లు చెప్పసాగిరి.
*C:\Users\maake\Downloads\for learning\*/>
స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి ఎనిమిదో అధ్యాయము - ఎనిమిదవరోజు పారాయణము సమాప్తము.