ௐ

కార్తీక పురాణం - 9వ అధ్యాయము

గయాధీశ పూజన విధానమైన గయమహిమ

"ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ము లను పంపెను" యని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు "విష్ణుదూత లారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు, రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా వుండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులవారీ కార్య కలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు.

picture1

వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారును, గోహత్య, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను- గురువులను- బంధువులను- కులవృత్తిని తిట్టి హింసించు వారున్నూ, జీవహింస చేయువారున్నూ దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించు వారును, జారత్వం చోరత్వంచే భ్రష్టులగువారును, యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును, శిశుహత్య చేయువారును, శరణన్నవానిని కూడా వదలకుండా బాధించు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలేవారునూ పాపాత్ములు. వారు మరణించగనే తనకడకు తీసుకు వచ్చి నరక మందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజామీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకులోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి, కామాంధుడై వావి వరసలు లేక, సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు యెట్లు తీసికొనిపోవుదురు?" అని యడుగగా విష్ణుదూతలు "ఓ యమకింకరులారా! మీరెంత అవివేకులు? మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మము లెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును. జప దాన ధర్మములు చేయువారును-అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయు వారును, అనాధప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచు వారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు 'నారాయణ' యని శ్రీహరినిగాని, 'శివా' అని శివునిగాని స్మరించువారును, తెలిసిగాని, తెలియకగాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిని బడినవారును పుణ్యాత్ములు! కాబట్టి అజామీళుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున "నారాయణా" అని స్మరించుచూ చనిపోయెను గాన, మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము" అని పలికిరి.

అజామీళుడు విష్ణుదూతల, యమదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది "ఓ విష్ణుదూతలారా! పుట్టిననాటి నుండి నేటివరకూ శ్రీమన్నారాయణ పూజగాని, వ్రతములుగాని, ధర్మములుగాని చేసి యెరుగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారునియందున్న ప్రేమచే "నారా యణా" అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠము నకు తీసుకొనిపోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లితండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది." అని పలుకుచు సంతోషముగ విమానమెక్కి వైకుంఠమునకు కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసి గాని, తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికినీ నిజము.

picture2

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి నవమాధ్యాయము — తొమ్మిదవరోజు పారాయణము సమాప్తము.