కార్తీక పురాణం - 10వ అధ్యాయము
అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము
అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము
జనకుడు వశిష్ఠులవారిని గాంచి "మునిశ్రేషా! యీ అజామీళుడు యెవడు? ఇప్పుడి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వాడి పూర్వజన్మ మెటువంటిది? పూర్వజన్మంబున నెట్టి పాపములు చేసియుండెను? వివరించవలసినది"గా ప్రార్థించెను. అంత నా యిట్లు పలికెను. మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి
"జనక మహారాజ ! అజామీళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడికేగి, "ప్రభూ! తమ ఆజ్ఞ ప్రకారము అజామీళుని తీసుకొనివచ్చుటకు వెళ్లగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమానమెక్కించి వైకుంటమునకు దీసుకొనిపోయిరి. మేము చేయునదిలేక చాలా విచారించుచూ యిచటకు వచ్చినారము" అని భయకంపితులైన విన్నవించుకొనిరి.
"ఔరా! ఎంతపని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును" అని యముడు తన దివ్యదృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని “ఓహో! అదియా సంగతి! తన అవసానకాలమున “నారాయణ” అని వైకుంఠవాసుని నామస్మరణచేసి యుండెను. అందులకుగాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొనిపోయిరి. తెలియక గాని, తెలిసిగానీ మృత్యుసమయమున హరినామ స్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజామీళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా!" అని అనుకొనెను.
అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందంచేతను, సిరిసంపదలచేతను, బలముచేతను గర్విష్టియై వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయముయొక్క ధనము నపహరించుచు, శివుని విగ్రహమువద్ద ధూపదీప నైవేద్యములను బెట్టక, దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది. ఆమెకూడా అందమైన దగుటచే చేయునదిలేక ఆమె భర్త చూచియు చూడనటులనుండి భిక్షాటనకై వూరూరా తిరుగుచూ ఏదోవేళకు యింటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచనచేసి పెద్దమూటతో బియ్యము, కూరలు నెత్తినిబెట్టుకొని వచ్చి అలసిపోయి "నాకు యీరోజున ఆకలిమిక్కుటముగా నున్నది త్వరగా వంటచేసి పెట్టుము" అని భార్యతో ననెను. అందులకామె చీదరించుకొనుచు, నిర్లక్ష్యముతో కాళ్లు కడుగుకొనుటకు నీళ్లుకూడా యీయక, అతని వంక కన్నెత్తియైననూ చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుటవలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కఱ్ఱతో బాదెను. అంత ఆమె భర్త చేతినుండి కఱ్ఱ లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బైటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుటవలన ఇక యింటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటి నుండి వెడలి పోయెనుకదా యని సంతోషించి, ఆమె ఆ రాత్రిబాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి యుండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను.
*C:\Users\maake\Downloads\for learning\\*/>
అతనిని పిలిచి "ఓయీ! నీవీరాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంతనా చాకలి"తల్లీ! నీవు బ్రాహ్మణపడతివి. నేన నీచకులస్తుడను, చాకలివాడిని. మీరీవిధముగ పిలుచుట యుక్తముగాదు. నేనిట్టి పాపపు పని చేయజాలను" అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటనుండి బయలు దేరి ఆగ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి "అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను యింటి నుండి వెడలగొట్టి క్షణికమయిన కామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని" అని పశ్చాత్తాపంతో, ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసి నదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త యింటికిరాగా పాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటినుండి యామె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను.
కొంతకాలమునకు శివార్చనకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరల నరజన్మ మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీకమాస మున నదీస్నానమున చేసి దేవతాదర్శనము చేసి యుండుటవలన నేడు జన్మముల పాపములు నశించుటచేత అజామీళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసానకాలమున 'నారాయణా' అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను.
బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనల ననుభవించి ఒక మాలవాని యింట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిస్కుడు చెప్పెను. మాలవాడా శిశువును తీసుకొనిపోయి అడవియందు వదలిపెట్టెను. అంతలో నొక విప్రుడు ఆ దారినపోవుచు పిల్లయేడుపు విని జాలి కలిగి తీసుకొనిపోయి తన యింట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే ఆజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంతమిదియే.
నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీకమాస స్నానప్రభావముల వలన నెటువంటివారైననూ మోక్షమొంద గలరు. గాన కార్తీకమాసమునందు వ్రతములు. పురాణ శ్రవణములు చేసినవార లిహపర సుఖములు పొందగలరు.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్టస్త్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి దశమాధ్యాయము - పదవరోజు పారాయణము సమాప్తము.