ௐ

కార్తీక పురాణం - 11వ అధ్యాయము

కార్తీక చతుర్దశీ నిశిత కార్యక్రమ ప్రభావము

మంథరుడు - పురాణమహిమ

ఓ జనక మహారాజా! యీ కార్తీకమాస వ్రతము యొక్క మాహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివితీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన యెడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణ్వర్చనానంతరం పురాణపఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటివారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము. అని వశిష్ఠులవారు ఈవిధముగా చెప్పేను.

పూర్వము కళింగదేశమున మంధరుడము అందు బ్రాహ్మణుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు, మద్యమాంసాది పానీయములు సేవించుచూ తక్కువజాతివారి సాంగత్యము వలన స్నానము జపము, దీపారాధనా వర్ణాశ్రమ ఆచార ధర్మాలు పాటింపక దురాచారుడై తిరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతము సదాచార ఉత్తమురాలు, భర్త యెంత దుర్మార్గుడయినను, పతియే దైవముగానెంచి విసుగుచెందక సకల ఉపచారములు జేయుచు, పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల యిండ్లలో వంట పనిచేయుచు వ్నన ఇల్లు గడవక చిన్నవర్తకము కూడ చేయసాగెను, ఆఖరికి దానివలన కూడ పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచూ, దారికాచి బాటపారులను బాధించుచు వారివద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను.

ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించు చుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధవము మూటగట్టుకొని వచ్చుచుండెను. అడవి దారిలో ఒక గుహనుండి వ్యాఘ్ర మొకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానినికూడా చంపెను. కాని ఆ పులికూడా తన పంజాతో కిరాతుకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈవిధముగా ఒకేకాలమున నలుగురూ నాలుగు విధముల ఒకరికొక్కరు హత్యలు కావించి చనిపోయినందున ఆ నలుగురు కూడ యమలోకమునకు వెడలి అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి.

vratham1.jpeg

మంధరుడు చనిపోయినవాటి నుండి అతని భార్య నిత్యమూ హరినామ స్మరణ చేయుచు సదాచారవర్తినియై భర్తను తలచుకొని దుఃఖించుచు కాలము గడుపు చుండెను. కొన్నాళ్లకు ఆమె యింటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి "స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగాని, సంతతిగాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్న దానను, కాన, నాకు మోక్షమార్గము ప్రసాదించు"మని బ్రతిమాలు కొనెను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి "అమ్మా! ఈ దినము కార్తీక పౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసికొని వచ్చెదను. నీవు ప్రమిదను, వత్తిని తీసికొని రావలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీవందుకొనుము" అని చెప్పినతోడనే అందుకామె సంతసించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండువత్తులు వేసి ఋషి తెచ్చిననూనె ప్రమిదెలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించినవారినెల్ల "ఆరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు వెల్లమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రియంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణు దూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు దీసికొనిపోయిరి. కాని- ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషము ఉండుటచేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికొనిపోయిరి. అచట నరకమందు మరోముగ్గురితో బాధపడుచున్న తన భర్తను జూచి "ఓ విష్ణుదూతలారా! నాభర్తా, మరిముగ్గురు యీ ‌నరక మందు బాధపడుచున్నారు. కాన, నాయందు దయ యుంచి వానిని ఉద్దరింపు"డని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు "అమ్మా! నీభర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవవాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను. మూడవవాడు వ్యాఘ్రము. నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారములు చేసి కార్తీక ద్వాదశిరోజున కూడా తైలలేపనము, మధ్య మాంసభక్షణ చేసివాడు కావున పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురూ నరక బాధలు పడుచున్నారు." అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాల విచారించి "ఓ పుణ్మాత్ము లారా! నా భర్తతోపాటు మిగిలిన ముగ్గురనూ కూడ ఉద్దరింపుడు "అని ప్రార్థించగా, అందులకు ఆదూతలు "అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదెఫలము కిరాతకు నకు, పురాణము వినట వలన కల్గినఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను. ఆ నలుగురును ఆమె కడకువచ్చి విమాన మెక్కి వైకుంఠమునకు వెళ్లిరి, కావున, ఓరాజా! కార్తీకమాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుటవలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా?" అని వశిష్ఠుల వారు అడిగిరి.

స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి ఏకాదశాధ్యాయము - పదకొండోరోజు పారాయణము సమాప్తము.