ௐ

కార్తీక పురాణం - 12వ అధ్యాయము

కార్తీక చతుర్దశీ సంబంధమైన సుందరీ పూజన ఫలము

ద్వాదశీ ప్రశంస

"మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను"మని వశిష్ఠ మహా ముని ఈవిధముగా తెలియచేసిరి.

కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి, ఆచమనము చేయవలయును. తరువాత శక్తికొలదీ బ్రాహ్మణునకు దానమిచ్చి, ఆరోజంతయు ఉపవాసముండి, సాయంకాలము. శివాలయమునకుగాని, విష్ణ్వాలయమునకు వెళ్లిదేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింప వలయును. ఈవిధముగా చేసినవారికి సకలసంపదలు కలుగుటయేగాక, మోక్షము కూడా పొందుదురు. కార్తీకమాసములో శనిత్రయోదశి వచ్చినయెడల నావ్రతమాచరించి నచో నూరు రెట్లు ఫలితము కలుగును. కార్తీకశుద్ధ యేకాదశిరోజున పూర్ణోపవాసముండి ఆరాత్రి విష్ణ్వాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరిసన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసినవారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటె నధికముగా ఫలము కలుగును.

కార్తీకశుద్ధ ద్వాదశినాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపునుండి లేచును గనుక, కార్తీకశుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు యిష్టము. ఆరోజున శ్రీమంతులైవదైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి, దూడతోసహా బ్రాహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయావు శరీరమందు ఎన్నిరోమములు కలవో అన్నిసంవత్సరములు యింద్రలోక ములో స్వర్గసుఖము లందుదురు. కార్తీకమాసమందు వస్త్రదానము చేసినను, గొప్ప ఫలము కలుగును. మరియు, కార్తీకశుద్ధ పాడ్యమిరోజున, కార్తీక పౌర్ణమిరోజున కంచు పాత్రలో ఆవునెయ్యిపోసి దీపముంచినవారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశిరోజున బంగారు తులసిచెట్టునుగాని, సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన యెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు- శ్రద్ధగా ఆలకింపుము.

salagrama1

సాలగ్రామ దానమహిమ

పూర్వము అఖండ గోదావరీ నదీతీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు, తాననుభవించక, యితరులకు బెట్టక, బీదలకు దానధర్మములు చేయక, యెల్లప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విఱ్ఱవీగుచూ యేజీవికీ కూడా ఉపకారమై ననూ చేయక “పరుల ద్రవ్యము నెటుల అపహరింతునా!" యను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను.

అతడొకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తనవద్దనున్న ధనమును పెద్దవడ్డీకి అప్పు యిచ్చెను. మరికొంత కాలమునకు తనసామ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు "అయ్యా! తమకీయవలసిన తీర్చని యెడల మరుజన్మమున మీయింట యేజంతువుగానో పుట్టి అయినా, మీ ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను, ఈజన్మలో ఋణము తీర్చుకోగలను" అని సవినయముగా వేడుకొనెను. ఆమాటలకు కోమటి మండిపడి "అట్లు వీలులేదు. నాసామ్ము నాకిసండే యీయవలయును, లేనియెదల నీకంఠమును నరికివేయుదుము" అని ఆవేశంకొలదీ వెనుకముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకము కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి. అక్కడనే యున్నచో రాజ భటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణహత్య మహా పాపం కనుక, అప్పటినుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యాపాప మావహించి కుష్టువ్యాధి కలిగి నానాబాధలు పడుచూ మరికొన్నాళ్ళకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొనిపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి, ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు, నీడకొరకై చెట్లు నాటించుచు, నూతులు, చెరువులు త్రవ్వించుచు, సకల జనులను సంతోషపెట్టుచు మంచికీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాల మునకు త్రిలోకసంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమును వచ్చి, త్రోవలో ధర్మవీరుని యింటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదులవారికి పాష్టాంగ దండప్రణామము లాచరించి, విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధులచేత సత్కరించి, చేతులు జోడించి "మహానుభావా! నా పుణ్యంకొలదీ నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావనమైనది. శక్తికొలదీ నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు" అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి “ఓ ధర్మవీరా! నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహావిష్ణువునకు కార్తీకమాసంలో శుద్ధద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నేజాతివారైననూ, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రతయైనా, వ్యభిచారిణియైనా కార్తీకశుద్ధ ద్వాదశిరోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి, సాలగ్రామ దానములు చేసినయెడల వెనుకటి జన్మలందూ, ఈజన్మమందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరక మనుభవించుచున్నాడు. అతనిని వుద్దరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లుచేసి నీతండ్రి ఋణం తీర్చుకొనుము" అని చెప్పెను. అంతట ధర్మవీరుడు "నారద మునివర్యా! నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని. అటువంటి

దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ”మనే రాతిని దానము చేసి నంత మాత్రమున ఆయన యెట్లు పుద్దరింపబడునా యని సంశయము కలుగు చున్నది. దీనివలన ఆకలిగా వున్నవాని ఆకలితీరునా! దాహంగొన్న వానికి దాహంతీరునా? కాక, యెందులకీ దానము చేయవలయును? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల"నని నిష్కర్షగా పలికెను.

ధర్మవీరుని అవివేకమునకు విచారించి "వైశ్యుడా! సాలగ్రామమును శిలామాత్ర ముగా ఆలోచించితివి. అది శిలకాదు. శ్రీహరియొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధనుండి విముక్తుని గావింప నెంచితివేని, యీ దానముతప్ప మరొక మార్గము లేదు" అని చెప్పి నారదుడు వెడలిపోయెను.

ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు, దానసామర్థ్యము కలిగియుం డియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర మేడు జన్మల యందు పులియై పుట్టి, మరిమూడు జన్మలందు వానరమై పుట్టి, ఐదుజన్మలు ఎద్దుగా పుట్టి, పదిజన్మలు మానవ స్త్రీగా పుట్టి, పదిజన్మలు పందిగా జన్మించియుండెను. అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేదబ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యౌవనకాలము రాగా ఆ పేదబ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.

చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లితండ్రులు బంధుమిత్రులు చాల దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు యెందువలన కలిగెనా యని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెచేత సాలగ్రామదానము చేయించి “నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక" యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయించెను. ఆరోజు కార్తీక సోమవారమగుటవలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతనదంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి, జన్మాంతరమున స్వర్గమున కరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణపుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.

salagrama

కావున ఓ జనకా! కార్తీకశుద్ధ ద్వాదశిరోజున సాలగ్రామదానం చేసిన దానఫలము యింతింతగాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి ద్వాదశాధ్యాయము - పన్నెండోరోజు పారాయణము సమాప్తము.