ௐ

కార్తీక పురాణం - 13వ అధ్యాయము

ఉషస్తిర్థ స్నానం విధానమైన దరిద్రతా నిరసనం

upanayanam1

ఉపనయనం

కన్యాదాన ఫలము

ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో ఇంకను ఇదేవిధిగా చేయవలసిన ధర్మములు చాలానేఉన్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.

కార్తీకమాసంలో నదీస్నానం ముఖ్యము. దానికంటేఒకపేదబ్రాహ్మణుని కుమారు నకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావన లతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈవిధముగా ఒక పేదబ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినయెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, యెంతటి దుష్కృతములు చేసియున్ననూ, యెంతటి వ్యభిచారం చేసియున్ననూ, ఆ పాపము లన్నియూ పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణబాలునికి ఉపనయనము జేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసినయెడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడ తరింపజేసిన వాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము.

nadhisnanam

నధిస్నానం

సువీర చరిత్రము

ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు"డను ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీతీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్నిరోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతిగారాబముతో పెంచుచుండిరి. క్షత్రియవంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికి శుక్లపక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతిగారాబముతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కనులపండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడచినకొలదీ, బాలికకు నిండుయౌవనదశ వచ్చెను. ఒకదినము వానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు "ఓ మునిపుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యె నా కుమార్తెనిచ్చి పెండ్లిచేతు"నని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైననూ లేకపోవుటచే బాలికపై నున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించ, కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పా పుచ్చుకొని సంతోషించి, తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి న దంపతుల నిద్దరినీ అత్తవారింటికి పంపెను.

kanyadhanam

కన్యధానం

అటులా మునికుమారుడు భార్యను వెంట బెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్య తో సుఖమను అనుభవించు చుండెను. సువీరుడు ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచూ భార్యతో సుఖంగా వుండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరియెక్క బాలికను కనెను. ఆ బిడ్డకు కూ యుక్తవయస్సురాగానే మరల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.

ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరము నకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని "ఓయీ! నీవెవ్వడవు? నీవు వర్చస్సుచూడ రాజవంశమునందు జన్మించినవానివలె నున్నావు. నీవీ యరణ్య మం భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశ్నించగా, సువీరుడు “మహను భావా! నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువు లాక్రమించుటచే భార్యాసమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్ర ముకంటె కష్టమేదియునూ లేదు. పుత్రశోకముకంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగముకంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడనయి నందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రున కిచ్చి, వానివద్ద కొంత ధనము పుచ్చు కొంటిని. దానితోనే యింతవరకు కాలక్షేపము చేయు చున్నాను" అని చెప్పగా "ఓరాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మమును ఆలోచింపక కన్యను అమెకొంటివి. కన్యా విక్రయము మహా పాతకములలో నొకటి, కన్యను విక్రయించిన “అసి పత్ర వన” మను నరకమనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని, పితృదేవతా ప్రీత్యర్థము యే వ్రతము చేసినను వారు నశింతురు. అదియును గాక కన్యా విక్రయము చేసినవారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థ మగుటయే గాక అతడు మహా నరకమును అనుభవించును. కన్యా విక్రయము జేసిన వారికి యె ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణముల తో అలంకరించి సదాచార సంపన్ను నకు, ధర్మ బుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నాన మొనరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయే గాక, మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడ తొలగిపోవును" అని రాజునకు హితో పదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి "ఓ మునివర్యా! దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండా భార్యా బిడ్డలతోను సిరిసందపల తోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడువ మంటారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాని ముక్కు ముసు కొని, నోరు మూసు కొని, బక్కచిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌర విస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధన మెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యాదానము మాత్రము చేయను." అని నిక్కచ్చిగా నుడి వెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.

మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసికొనిపోయి, యమ లోకములో అసి పత్ర వన మను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తి యను రాజు ధర్మ యుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించు చుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశముల తో బంధించి స్వర్గము నుండి నరకము నకు తీసుకొని వచ్చిరి.

అంతట శ్రుతకీర్తి "నేనెరిగి ఉన్నంత వరకును యితరులకు ఉపకార మును చేసి దాన ధర్మాదులు, యజ్ఞ యాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?" నని మనసు నందనుకొని నిండు కొలువు దీరి యున్న యమధర్మరాజు కడ కేగి, నమస్క రించి "ప్రభూ! నీవు సర్వజ్ఞు డవు, ధర్మ మూర్తివి, బుద్ధి శాలివి. ప్రాణి కోటినంతను సమంగా జూచు చుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి యుండలేదు. నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? చెప్పమని" అని ప్రాధేయ పడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి 'శ్రుతకీర్తీ! నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారముగాని చేసియుండలేదు. అయిన నేమి? నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ట పుత్రికను ధనమున కాశించి అమ్ము కొనెను, కన్య నమ్ము కొనేవారి పూర్వీకులు యిటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారున్నూ వారెంతటి పుణ్యపురుషులైనను నరకమను అనుభవించుటయేగాక, నీచ జన్మ లెత్తవలసి యుండును. నీవు పుణ్యా త్ముడవనియు ధర్మాత్ము డవనియు నేనెరుగుదును గాన , నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరాన తన తల్లి వద్ద పెరుగు చున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు వెళ్లి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడు నగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు మీ పితృగణ ములు కూడా స్వర్గలోకమున కేగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యా దానము చేసినవాడు మహా పుణ్యత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యము తో కన్యాదానము చేసినను, లేక విధి విధాన ముగా ఆంబోతునకు వివాహ మొనర్చినను కన్యా దాన ఫల మబ్బును. కనుక, నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపి నటుల చేసితి వేని ఆ ధర్మ కార్యమువలన నీ పితృ గణము తరింతురు. పోయి రమ్మ" అని పలికెను.

శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదాశతీరమున ఒక పర్ల కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూసి సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలం కృత కన్యాదాన పూర్వకముగా చతు ర్వేదములు చదివిన యెక్క బ్రాహ్మణ యువకుని కిచ్చి అతి వైభవముగా వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ లోకములో నున్న పితృదేవతలను కలిసి కొనెను.కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశన మగును. వివాహ విషయము లో వారికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీకమాసమున కన్యాదానము చేయ వలయు నని దీక్ష బూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకము న కేగును

స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము - పదమూడోరోజు పారాయణము సమాప్తము