ௐ

కార్తీక పురాణం - 15వ అధ్యాయము

కార్తీక పూర్ణిమ సంబంధమైన కాతేయ హోమ విధానం

దీపప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపము పొందుట

అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకమహరాజ! కార్తీకమాహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము, తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివ కేశవు ల వద్ద దీపా ధానమ చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవ లయ దర్శనము- చేయలేనివారు కాల సూత్రమనేడి నరకమున బడి కొట్టు మిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షల తో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేష ఫలము పొందగలరు. ఈవిధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవ దుందుభులు మ్రోగు చుండగా విమాన మెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజు లం దైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచ వలెను.

ఈ మహా కార్తీకము లో ఆవుపాలు పితికి నంతసేపు మాత్రము దీప ముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడు గా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసిన యెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు. విను- మని వశిష్ఠలవారు యిట్లు చెప్పుచున్నారు.

సరస్వతీ నదీ తీరమున శిధిలమైన దేవాలయము ఒకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణపఠనము చేయ తలంపురాగా ఆ పాడుబడి యున్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామము నకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు జేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి యున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచి యున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాసమగుటవలనను, శివాలయములో ఆరి పోయిన వత్తి యీ యెలుకవల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దానిరూపము మారి

dheepam1

మానవరూపములో నిలబడెను. ధ్యాననిష్టలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా, ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీ వెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి? అని ప్రశ్నించగా "ఆర్యా! నేను మూషికము ను, రాత్రి నేను ఆహార మును వెదుకు కొంటూ ఈ దేవాలయము లోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరక నందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలెను అని దానిని నోట కరచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి వుండ గ, అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో- దానికిగల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీకుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ, ధనాశాపరుడవై దేవపూజలు, నిత్యకర్మములు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారిపై జీవించి నావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమనుభవించు చుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైతివి. దానవలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించు కొని మోక్షము పొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.