ௐ

కార్తీక పురాణం - 16వ అధ్యాయము

శిల్ప శాస్త్ర ప్రకారమైన చితుర్మాస్య వ్రత విధానం

స్తంభ దీప ప్రశంస

వశిష్ఠుడు చెబుతున్నాడు
"ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన, దాన, వ్రతాము లను చేయుట, సాలగ్రామము దానము చేయుట, చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తమకు శక్తివున్నా దానము చేయరో, అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెలదినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువ కుండ, తులసి కోటవద్దగాని- భగవంతుని సన్నిధినగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానము ఆచరించి, భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యము లతో దక్షిణ తాంబూలములు, నారికేళ ఫలములు దానము జేసిన యెడల చిరకాలము నుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.

సంతానము వున్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవు లై యుందురు. ఈ మాసములో ధ్వజ స్తంభము నందు ఆకాశ దీపము నుంచి న వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతు రు. కార్తీకమాస మంతయు ఆకాశ దీపము గాని, స్తంభ దీపము గాని వుంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యము లు కలిగి, వారి జీవితము ఆనందదా యకము అగును. ఆకాశ దీపము పెట్టు వారు శాలి ధాన్యం గాని, నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలయును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును, లేక దీపం పెట్టు వారిని పరి హా స మాడు వారును చుంచు జన్మ మెత్తు దురు. ఇందు ల కొక కథ కలదు. చెప్పెదను వినుము.

dheepam2

దీప స్తంభము విప్రుడగుట(భ్రహ్మణుడు గా మారుట)

ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసము లో ఆ యాశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయద్వారాలపై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను జూచి "ఓ సిద్ధులారా! కార్తీకమాసములో హరి హరాదుల ప్రీతికొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభము పాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికివెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కొనివత్తము, రండు" అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికివెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయు చుండగా ఫెళఫెళమను శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము ను చూచి వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభమునుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి "ఓయీ నీవెవడవు? నీవీ స్తంభము నుండి యెలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి" అని

ప్రశ్నించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి "పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణు డను మరియు జమీందారుడను. నా పేరు ధనలోభుడు, నాకు చాలా యైశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధు లు అలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయక మెలగితివి. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చి నన్ను ఆశ్రయించి నను అతనిచే నా కాళ్లు కడిగించి, ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాష లాడి పంపుచుండే వాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడను. అందరును నా చేష్టలకు భయపడువారేకాని, నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోరనరకములు అనుభవించి, లక్ష జన్మలయందు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదువేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా నున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని. నన్ను మన్నింపు"డని వేడుకొనెను.

ఆ మాటలాలకించిన, మునులందరును అమితాశ్చర్యమొంది "ఆహా! కార్తీకమాస మహిమ మెంత గొప్పది. ఆదియునుగాక, కార్తీకశుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు, కర్రలు, రాళ్లు స్తంభములు కూడ మనకండ్ల యెదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీప ముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్తంభమునకు ముక్తి కలిగిన"దని మునులు అనుకొనుచుండగా, ఆ పురుషుడామాట లాలకించి "మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును? అది నశించుటెట్లు? నాయీ సంశయము బాపు"డని ప్రార్థించెను. అక్కడవున్న మునీశ్వరు లందరును తమలో నొకడగు ఆంగీరస మునితో "స్వామీ! మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు గాన, వివరించు"డని కోరిరి. అంత వాంగీరసుడిట్లు చెప్పుచున్నాడు.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి షోడశాధ్యాయము - పదహారో రోజు పారాయణము సమాప్తము.