ௐ

కార్తీక పురాణం - 17వ అధ్యాయము

ఆంగీరస మహర్షి ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము

angirasa2

ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము!

కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధమువలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని మోదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ' యనగా యీ శరీరమును అహం కారముగా ఆవరించి వ్యవహరించుచున్నది- అని ఆంగీరసుడు చెప్పగా

“ఓ మునీంద్రా! నేనింతవరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్దజ్ఞానమునకు పాదార్థజ్ఞానము కారణ మగుచుండును. కాన, 'అహంబ్రహ్మ' యను వాక్యార్థమును గురించి నాకు తెలియ జేయండి" యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె- ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే. 'నేను-నాది' అని చెప్పబడు జీవాత్మయే 'అహం' అను శబ్దము. సర్వాంత ర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మ 'నః' అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధిసాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే “ఆత్మ” అనబడును. 'నేను' అనునది శరీరేంద్రియాదులలో నొకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రి యాదుల నన్నింటిని యేది ప్రకాశింపజేయునో అదియే "నేను" అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడ నామరూపంబుతో నుండి నశించు నవియేగాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరం బులను మూడింటియందునూ "నేను" "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము.

ఇనుము సూదంటురాయిని అంటి పెట్టుకొని తిరుగునటులు శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మవలన తమ పనిని తాము చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్రపోతిని, సుఖంగా వుంది' అనుకొనునదియే ఆత్మ.

‌

దీపము గాజు బుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింప జేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియా లను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగు చున్నారు. అట్టి విశేష ప్రేమా స్పదమగు వస్తు వేదో అదియే పరమాత్మ యని గ్రహింపు ము. 'తత్త్వ మసి' మొదలైన వాక్యములందలి ‘త్వం' అను పదమునకు కించి త్త్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం “తత్” అనుపదము నకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. "తత్త్యమసి” అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వము ను బోధించును. ఈరీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే 'ఆత్మ' దేహ లక్షణము - ఉండుట-జన్మించుట- పెరుగుట- క్షీణించుట-చచ్చుట మొదలగు ఆరుభాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి యున్నదో అదియే 'ఆత్మ'. ఒక కుండనుజూచి అది మట్టితో చేసినదేయని యేవిధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ యని తెలుసుకొనుము.

జీవుల చే కర్మ ఫల మనుభవింజేసే వాడు పరమేశ్వరు డనియు, జీవు లా కర్మ ఫలమను అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యము లు గలిగి ముక్తి పొందుము. అందువలన సత్క ర్మానుష్టానము చేయవలయును. మంచిపనులు చేసిన గాని ముక్తి లభించును-అని అంగీరసుడు చెప్పగా ధన‌లోభుడు నమస్కరించి యిట్లనెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి సప్త దశాధ్యాయము - పదిహేడు రోజు పారాయణము సమాప్తము.