కార్తీక పురాణం - 18వ అధ్యాయము
కీర్తన సంబంధమైన కార్తీక వ్రత విధానం
సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము
"ఓ మునిచంద్రా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని, సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి-గురువు- అన్న-దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్యఫలితము వలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా, తమ కృపవలననే నాకు మోక్షము కలిగినదికదా! మీదర్శన భాగ్యము లేనియెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టురూపమున వుండవలసి నదే కదా! అట్టి నేనెక్కడ? మీ దర్శనభాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పుణ్యఫల ప్రదాయియగు యీ కార్తీకమాసమెక్కడ? పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణువు ఆలయ మందు ప్రవేశించు టేకడ?ఇవి అనియు దైవీక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు.కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించ వలయునో, దాని ఫలమెట్టిదో విశదీకరింపు"డని ప్రార్థించెను.
"ఓ ధనలోభా! నీవడిగిన ప్రశ్నలన్నియు ముంచివే. అవి అందరికీ వుపయోగార్డ మైనట్టివి కావున, వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకేగాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని, సకలశాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కల్గును. మానపుడే జాతివాడో, యెటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసు కొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మల ను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీకమాసమందు సూర్యభగ వానుడు తులారాశిలో ప్రవేశించుచుండ గాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండ గాను, మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండ గాను అనగా ఈ విష్ణువు మూడు మాసములయందయిననూ తప్పక నదిలో ప్రాతఃకాలస్నానము చేయ వలెను. అటుల స్నానము లాచరించి దేవతార్చన చేసినయెడల తప్పక వైకుంఠప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములయందు స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించినవారికి చతుర్విధ పురుషార్ధములు సిద్ధించును. కార్తీకమాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరీ నదులకు సమానతీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడునూ, శ్రీహరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకొనుడు. కార్తీకమాసమందు విద్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించినవారు కోటియాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠము నకు పోవుదురు" అని ఆంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.
"ఓ మునిశ్రేష్ఠా! చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే! ఏకారణం చేత దానిని ఆచరించ వలెను? ఇదివరకు ఏవ్వరయిన ఈ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతముయొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తరంగా విశదీకరింపు"డని కోరెను. అందులకు ఆంగీరసుడు ఇటుల చెప్పెను.
"ఓయీ! వినుము. చాతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ యేకాదశీ దినమున పాలసముద్రమున శేషుని పాన్సుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్య మని పేరు. అనగా ఆషాఢ శుద్ధ యేకాదశి 'శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతికొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలవ తెలిసికొంటిని. కావున, ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను."
"తొల్లి కృతయుగంబున శ్రీవైకుంఠమందు గరుడగంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసన మున కూర్చుండియుండగా ఆ సమయమున నారదమహర్షి వచ్చి పద్మనేత్రుండును, చతుర్భాహుండును, కోటిసూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో ఇట్లనెను. 'నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మా నుష్ఠానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరు వారికి విధించ బడిన ధర్మముల నాచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక యున్నవి కదా?' అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి "ఓ దేవా! ఈ జగంబున నీవెరుగని విషయము లేవియునూ లేవు. అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు జన్మ రాహిత్య భందముల నుండి విముక్తులగు దురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించు చున్నారు. కొందరు పుణ్యావ్రతములు చేయుచు; అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టివారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు"మని ప్రార్థించు చున్నాను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవర పడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.
ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆవిధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని యెగతాళి చేయుచుండిరి. కొందరు "యీ ముసలివానితో మనకేమి పని" యని ఊరకుండిరి. కొందరు గర్విష్టులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెతియైనను చూడకుండిరి. వీరందరిని భక్తవత్సలుడగు శ్రీహరిని గాంచి "వీరినెట్లు తరింపజేతునా? యని ఆలోచించుచు, ముసలిబ్రాహ్మణ రూపమును విడిచి, శంఖ చక్ర, గదా, పద్మ కౌస్తుభ, వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి, లక్ష్మీదేవి తోడను, భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.
ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారయణుని దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు లక్ష్మీనారాయణులను స్తోత్రము గావించిరి.
శాంతాకారం! భుజగశయనం! పద్మనాభం! సురేశం!
విశ్వాకారం! గగన సదృశం! మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మీకాంతం కమలనయనం! యోగిహృద్ధ్యాన గమ్యం!
వందేవిష్ణుం! భవభయహరం! సర్వలోకైక నాథం॥
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్య్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం॥
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి అష్టదశాధ్యాయము — పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తము.