కార్తీక పురాణం - 19వ అధ్యాయము
దీపదాన సంబంధమైన పరమ ఫలం
చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ
*C:\Users\maake\Downloads\for learning\*/>
ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి “ఓ దీనబాంధవా! వేదవేద్యుడ వని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నంద నందనా! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాసస్థలములు అన్ని పవిత్రములైనవి. ఓ దయామయా మేము ఈ సంసార బంధము నుండి బైటపడలేకుంటిమి. మమ్ముద్దరించుము. మానవుడెన్ని పురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనము బడయజాలరు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడగుదువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి "జ్ఞానసిద్ధా! నీ స్తోత్రవచనమునకు నేనంతయు సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు "ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరమునుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగవలె కొట్టుకొనుచున్నాను. కనుక, నీ పాదపద్మములపై నా ధ్యానముండు నటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు" అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు “ఓ జ్ఞానసిద్ధుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొక వరము కూడా కోరు కొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టివారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.
నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీకమాసమున శుద్ధద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము, ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి, నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యము లందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మాహాత్మ్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసినవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములును, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పొలును, ఆశ్వయుజ శుద్ధదశమి మొదలు పప్పుదినుసులును విసర్జించవలయును. నాయందు భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీవొపంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తిశ్రద్ధలతో పఠించినవారు నా సన్నిధికి "నిశ్చయముగా వత్తురు."అని శ్రీమన్నారయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వళించెను.
వశిష్టుడు జనకమహారాజుతో "రాజా! ఈవిధముగా విష్ణుమూర్తి, జ్ఞాన సిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహాత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చాతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమునకు ఎగిరి.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి ఏకోనవింశాధ్యాయము - పంధొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.