ௐ

కార్తీక పురాణం - 20వ అధ్యాయము

పురంజయుడు దురాచారుడగుట

జనక మహారాజు, చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో "గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రతమహాత్మ్యమున దింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా జేయు" డనెను. ఆ మాటలకు వశిష్టులవారు మంద హాసముతో “ఓ రాజా! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి, అత్రి మునికి జరిగిన ప్రసంగమొకటి కలదు. దానిని వివరించెదను ఆలకించు"మని ఆ కథావిధానమును యిట్లు వివరించిరి.

agasthyaathri

అగస్త్యమహర్షి అత్రిమహర్షిని గాంచి “ఓ అత్రిమహ మునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యము నీకు ఆమూలాగ్రము తెలియును. కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత అత్రిమహాముని “కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమయిన కార్తీకమాసముతో సమానమగు మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేడ దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీకమాసమున నదిలో స్నానము చేసినన శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలు ఫలితము అపారము, ఇందుకొక యితిహాసము వినుము.

త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసికొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండ పాలించు చుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చోరులను జేరదీసి వారిచే దొంగతన ములు, దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనము లో సగము వాటా తీసికొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవుల బడినది. వారు తమలో తామాలోచించు కొని`కాంభోజరాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతిపైన్య బలాన్వితు లై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి, నలువైం శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి.

First image Second image

అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి చారులవలన తెలిసికొన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్ధుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయువిచారించి యే మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధసన్నద్ధుడై -వారిని యెదుర్కొని భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రుసైన్యములపై బడెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి వింశాధ్యాయము - ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము.