ௐ

కార్తీక పురాణం - 22వ అధ్యాయము

కార్తీక చతుర్దశీ వ్రత ఫలం

పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట

మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్ప దొడగెను.

పురంజయుడు వసీష్ఠులవారు చెప్పిన ప్రకారము కార్తీకపౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశ ఉపచారములతో పూజించి, శ్రీహరిని గానము చేసి, నాట్యము ఆడి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయము కాగానే నదికి పోయి, స్నామాచరించి తన గృహమున వేలుచు వుండేవాడు అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధబ్రాహ్మణుడు - మెడనిండా తులసీమాలలు ధరించి పురంజయుని సమీపించి "రాజా! విచారింపకుము. నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడదీసుకొని, యుద్ధసన్నద్ధుడవై నీ శత్రురాజులతో యుద్ధం చేయు ము. నీ రాజ్యము నీకు దక్కును". అని దీవించి అదృశ్యుడయ్యెను. "ఈతడెవరో మహానుభావునివలె ఉన్నాడు అని, ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో వున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేక పోయినవి. ఆదియును గాక, శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా!

kingnatya

(పురంజయ మహారాజు దేవుని సానిధి లో నాట్యము చేయుట )

ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి "పురంజయా రక్షింపుము రక్షంపు" మని కేకలు వేయుచు పారిపోయిరి, పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదు నకు తండ్రి విషాన్ని యివ్వగా "శ్రీహరి” అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా!

హరినామస్మరణ చేసినవారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేనివారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీస్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపా రాధన చేసినచో సర్వవిపత్తులును పటాపంచలగును. అన్ని సౌఖ్యములు చేకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించువారికి యే జాతివారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతా నుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుఁ సంసార సాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతిభేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి. భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవడి కైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరియొకరిచే దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి-భక్తులు అన్యోన్య సంబంధీ అందువలన లోకపోష కుడు, భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సంపదల నొసంగి కాపాడుచుండును.

శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్యభగవానుల తేజస గల వాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పదునాలుగు లోకము లను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ విష్ణువునకు అతిప్రియమైన కార్తీకమాస వ్రతమును భక్తిశ్రద్ధలతో యెవరు చేయుదురో వారియింట శ్రీమహావిష్ణువు లక్ష్మీసమేతుడై వెలయగలడు. ఆ యిల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణపఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

kingdarbar2

(పురంజయ మహారాజు ప్రజలను కనబిడ్డల వలె పాలన చేయుట)

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి ద్వావింశాధ్యాయము - ఇరవై రెండోరోజు పారాయణము సమాప్తము