కార్తీక పురాణం - 23వ అధ్యాయము
కార్తీక మాసం సంబంధమైన సంచిత కర్మమోచనం
శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట
*C:\Users\maake\Downloads\for learning\*/>
(పురంజయ మహారాజు శ్రీరంగక్షేత్రమున దర్శించి ముక్తి నొందుట)
అగస్త్యుడు మరల అత్రిమహర్షిని ఇలా అడిగే "ఓ మునిపుంగవా! విజయము పోందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"మని యడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి - కుంభసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును యేలుచుండెను. తనయొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్న దాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదవేదాంగవేత్తయై యుండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన ఆఖండకీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడై యుండెను. ఇన్నియేల? అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏదేశమున, యేకాలమున, యే క్షేత్రమున యేవిధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ నగుదునా? యని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి "పురంజయా! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవు అచటకేగి శ్రీ రంగనాధ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందేదువు" అని పలికెను.
అంతట పురంజయుడు ఆ యశరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్ర ములను దర్శించుచు, ఆయాదేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవ్వళించియున్న శ్రీరంగనాథుని చూచి పరవశము చేంది, చేతులు జోడించి,
"దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా! అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషీకేశా! ద్రౌపదీమాన సంరక్షకా! దీనజన భక్తపోషా! ప్రహ్లాదవరదా! గరుడధ్వజా! కరివరదా! పాహిమాం! పాహిమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మా దాసోహం" యని విష్ణుస్తోత్రమును పఠించి, కార్తీకమాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీకమాసములో చేసిన వ్రతముల మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో, పాడిపంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.
అయోధ్యానగరము ధృఢ ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహగోవురాదులతో చతురంగ సైన్యసంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్ధనేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగరమందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మపత్రాయత లోచనులూ విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము; సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగియుండిరి.
ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూపలావణ్య సంపన్నలై, సదా మోహన హాసాలంకృత ముఖశోభితలై యుండిరి. ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూషా పరాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.
పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాకవిని పౌరజనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో యెదురేగి నగరప్రదక్షిణచేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహికవాంఛలను వదులుకొని, తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమున కేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీకవ్రత మాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్యా! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మాహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివినవారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి త్రయోవింశాధ్యాయము - ఇరవై మూడోరోజు పారాయణము సమాప్తము