కార్తీక పురాణం - 28వ అధ్యాయము
దీపదాన విధానమైన గృహ సంరక్షణ
విష్ణు సుదర్శనచక్ర మహిమ
జనక మహారాజా! వింటివా దూర్వాసుని అవస్థలు! తాను యెంతటి కోపవంతు డైనను, వెనుకముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను.
అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి “అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో, ద్వాదశీ పారాణమునకు నన్నాహ్వానించితివి, కాని నిన్ను కష్టముల పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనముచేయ తలపెట్టితిని. కావున , నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణుచక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని. ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగుమని చెప్పినాడు. కావున నీవే నాకు శరణ్యము, నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత విషగలవాడ నైనను నీ నిష్కళంక భక్తిముందు అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడు" మని అనేక విధాల ప్రార్థింగా, అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, "ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసి యో, తెలియక యో తొందర పాటుగా యీ కష్టములు కొని తెచ్చు కొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతని ని చంప వలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితినేని, ముందు నన్ను చంపి, తర్వాత ఈ దూర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధము లలో, అనేకమంది లోక కంటకులను చంపితివి గాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే యీ దూర్వాసుడు ముల్లోకము లు తిరిగినను ఈతనిని వెంటాడుచు నే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు. నీశక్తికి యేవిధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీయందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును, శరణు వేడిన యీ దూర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి "ఓ భక్తాగ్రేశ్వరా! అంబరీషా! నీభక్తిని పరీక్షించుట కిట్లు చేసితిని గాని వేరు గాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమ వంతులైన మధుకైటభులను-దేవతలందరు యేకమై కూడ- చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీవారి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించు చుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీమీద జూసిన రౌద్రమును నేను తిలకించితివి. నిరపరాధి వగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసుల నందరను చంపగలదు గాని, శక్తిలో నాకంటె యెక్కువేమియుగాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తికంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడుగాని, క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటివాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు.
*C:\Users\maake\Downloads\for learning\*/>
ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు"మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, 'నేను దేవ గో, బ్రాహ్మణాదుల యందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నారాజ్యములో సర్వజనులూ సుఖముగా నుండవలెననియే నా యభిలాష కావున, శరణుగోరిన ఈ దూర్వాసునీ, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్లకొలది సూర్యమండలములు యేకమైననూ నీ శక్తికీ, తేజస్సుకూ సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోనిందితులపై, లోకకంట కులపై, దేవ- గో-బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తన కుక్షి యందున్న పధ్నాలుగు లోకములను కంటికిరెప్పవలె కాపాడుచున్నాడు. కావున, నీకివే నామనఃపూర్వక నమస్కృతులు." అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణుస్తోత్రము మూడు కాలములయందు నెవరు పఠింతురో, యెవరు దానధరమ్ములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, యెవరు పరులను హింసించక - పరధనములను ఆశపడక- పరస్త్రీలను చెరబెట్టక-గోహత్య -బ్రహ్మణహత్య- శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, దూర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రతప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి అష్టావింశాధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.